సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) తొలి నోటిఫికేషన్ జారీ అయింది.
వివిధ శాఖల్లో 770 సివిల్ ఇంజనీర్ (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్) పోస్టుల భర్తీ కోసం బుధవారం దీనిని జారీ చేశారు. వచ్చే నెల 3వ తేదీలోగా వీటికి దరఖాస్తు చేసుకోవాలి. వచ్చే నెల 20న రాతపరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం, అర్హతలు, వయోపరిమితి తదితర పూర్తి వివరాలను కమిషన్ వెబ్‌సైట్ http://www.tspsc.gov.in లో పొందవచ్చు. ఇక మరిన్ని శాఖల్లో పలు పోస్టులకు ఈ నెలాఖరులోగా, అక్టోబర్‌లో గ్రూప్-2, డిసెంబర్‌లో గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్లు జారీచేయనున్నారు. హైదరాబాద్‌లోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషన్ సభ్యులుసి.విఠల్, చంద్రావతి, మతీనుద్దీన్ ఖాద్రీ, కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్‌తో కలసి చైర్మన్ ఘంటా చక్రపాణి ఈ వివరాలను వెల్లడించారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ఈ పోస్టులకు ఆన్‌లైన్ ద్వారా పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎంతో మంది ఎదురుచూస్తున్న గ్రూప్-2 నోటిఫికేషన్‌ను అక్టోబర్‌లో జారీ చేస్తామని, వచ్చే ఏడాది మార్చి నాటికి నియామక ప్రక్రియ పూర్తిచేస్తామని తెలిపారు. గ్రూప్-1 నోటిఫికేషన్‌ను డిసెంబర్ నాటికి జారీచేస్తామన్నారు. వివిధ శాఖల నుంచి రోస్టర్, రిజర్వేషన్ల వివరాలు రాగానే మిగతా పోస్టులకు నోటిఫికేషన్లు ఇస్తామని తెలిపారు. మొత్తంగా కమిషన్ ఆధ్వర్యంలో భర్తీ చేయాల్సిన 3,783 పోస్టులకు డిసెంబర్ నాటికి జారీ చేస్తామని తెలిపారు.
తొలి నోటిఫికేషన్ (సివిల్ ఇంజనీర్) పోస్టులు..
ఆర్‌డబ్ల్యూఎస్ – 418
పబ్లిక్‌హెల్త్, మున్సిపల్ ఇంజనీరింగ్ – 121
మున్సిపల్ , పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ – 5
రోడ్లు భవనాల శాఖలో – 83
నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖలో – 143
మొత్తం – 770